విమానంలో ప్రయాణించడం అనేది చాలామంది జీవితంలో ఒక కలగా మిగిలిపోతుంది. అలాంటి అవకాశమే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇద్దరు విద్యార్థులకు లభించింది. సైన్స్‌లో ప్రతిభ కనబరచిన ఈ ఇద్దరు విద్యార్థులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దిల్లీకి విమానంలో వెళ్లబోతున్నారు. సమగ్ర శిక్షా, సైన్స్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సైన్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ నెల 6 నుంచి 8 వరకు దిల్లీలో ఇస్రో నిర్వహించే స్పేస్ వర్క్‌షాప్కు ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా వారు రష్యన్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ కల్చర్, నేషనల్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియంలను కూడా సందర్శించనున్నారు. విద్యార్థులు తమ విజ్ఞాన ప్రతిభతో ఈ గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడం గర్వకారణమని డీఈవో చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ తెలిపారు.
ఆవిష్కరణల రూపశిల్పి
విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి పిల్లుట్ల వెంకట నాగార్జున సైన్స్ రంగంలో ప్రతిభావంతుడిగా ఎదుగుతున్నాడు. అతని తండ్రి వంశీకృష్ణ ఏపీఆర్‌జేసీలో సీనియర్ అసిస్టెంట్, తల్లి శశిరేఖ గృహిణి. సైన్స్ పోటీల్లో ఎప్పుడూ విజేతగా నిలుస్తూ, ఇటీవల ఇస్రో నిర్వహించిన యువికా కార్యక్రమానికి ఎంపికయ్యాడు. స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ యాప్‌ను రూపొందించి తన ప్రతిభను చాటుకున్నాడు. అమరావతి వీవీఐటీలో జరిగిన నాకా హ్యాకథాన్‌లో నవ ఆలోచనతో మెరిశాడు. సైన్స్ సెమినార్లు, వైజ్ఞానిక ప్రదర్శనలు, చెకుముకి పోటీల్లో కూడా రాణించాడు. తొలిసారి విమానం ఎక్కబోతుండటం ఎంతో ఉత్సాహంగా ఉందని, రోబోటిక్ సైంటిస్టుగా ఎదగాలనేది తన కల అని నాగార్జున చెప్పారు.
పోటీలలో మెరిసిన మరో తార
నాదెండ్ల మండలం కనపర్రు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి కారసాల కార్తిక్ కూడా సైన్స్ పోటీల్లో తన ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. తండ్రి అశోక్ క్రేన్ డ్రైవర్, తల్లి జమున గృహిణి. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లు, క్విజ్‌లు, వైజ్ఞానిక ప్రదర్శనలు, చెకుముకి పోటీల్లో పాల్గొని ఎల్లప్పుడూ ముందు వరుసలో నిలుస్తున్నాడు. ఇన్‌స్పైర్ ప్రోగ్రామ్‌కు కూడా నామినేట్ అయ్యాడు. మధుమేహాన్ని సహజ పద్ధతుల్లో నియంత్రించే ప్రాజెక్టును రూపొందించాడు. భవిష్యత్తులో పరిశోధన రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాలనేది తన లక్ష్యమని కార్తిక్ వెల్లడించాడు.



















