నిరుద్యోగులకు అండగా నిలవడం కోసం ప్రభుత్వం ‘కౌశలం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇంటి నుంచే పని చేసే అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. 18 సంవత్సరాలు నిండిన, కనీసం పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన యువత పూర్తి వివరాలతో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడంతో మంచి స్పందన లభిస్తోంది.
జిల్లాలో ఇప్పటి వరకు 1,37,745 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో 1,00,274 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువత వివరాలను సచివాలయ సిబ్బంది ‘కౌశలం’ యాప్‌లో నమోదు చేస్తున్నారు. “నిరుద్యోగుల విద్యా అర్హతలను, ఆసక్తులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణలు అందించి, ఉపాధి కల్పిస్తాం. ఈ పథకం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది” అని శ్రీకాకుళం డివిజన్ డీఎల్‌డీవో అరుంధతీ దేవి తెలిపారు.
సర్వే పూర్తయ్యిన తరువాత శిక్షణ ఇచ్చి, అర్హతల ఆధారంగా ఆసక్తి ఉన్న వారికి ఇంటి నుంచే లేదా పరిశ్రమల్లో పనిచేసే విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. శిక్షణ సమయంలో ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది.



















