ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్–2025’ అవార్డును అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 1.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ప్రతినిధులు ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేశారు. అదే వేదికపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఆ సంస్థ వైస్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా భువనేశ్వరి స్వీకరించారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా భువనేశ్వరికి ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్–2025’ అవార్డు లభించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం వంటి విభాగాల్లో ఆమె నిరంతర సేవలందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందారు. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి సేవలందించడంలోనూ ఆమె ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
అదేవిధంగా, హెరిటేజ్ ఫుడ్స్‌ను దేశంలోని ప్రముఖ డెయిరీ బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో భువనేశ్వరి కీలక పాత్ర వహించారు. సంస్థ అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, రైతుల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సంస్థ ఎదుగుదల దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ కృషికి గుర్తింపుగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించగా, ఆ అవార్డును భువనేశ్వరి స్వీకరించారు.




















