ఇంటర్నెట్ డెస్క్: దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో టార్గెట్ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులోభాగంగానే పలు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్లు తెలిపాయి.
ఈ టెర్రర్ మాడ్యూల్‌పై ఇటీవల జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, దిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తిమంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
దిల్లీ పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్, దిల్లీ, హరియాణా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి ఆరా తీస్తోంది. బుధవారం సాయంత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌తో ఎన్‌ఐఏ డీజీతో కీలక భేటీ నిర్వహించనున్నారు.




















