మధుమేహం ఒకప్పుడు అరుదుగా కనిపించే వ్యాధి కాగా, ఇప్పుడు దాదాపు ప్రతి కుటుంబంలో ఒక్కరిద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి కారణాలతో జిల్లా వ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వ్యాధి ఉన్న చాలా మంది వైద్యుల సూచనలు నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ సందర్భంగా న్యూస్ టుడే ఈ ప్రత్యేక నివేదికను అందిస్తోంది.
జిల్లాలో ఇటీవల నిర్వహించిన ప్రాథమిక ఆరోగ్య పరీక్షల్లో 16,58,624 మందిలో 8.4% మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారు. సరైన మందులు తీసుకుంటూ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చని వైద్యుల సూచన. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు తగ్గడం, కిడ్నీ సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చని హెచ్చరిక.
మధుమేహం అదుపులో ఉండాలంటే:
- ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించాలి
- నిర్ణీత సమయానికి భోజనం, నిద్ర పాటించాలి
- మద్యం, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి
- ఏటా ఈసీజీతో పాటు అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోవాలి
- బరువును నియంత్రణలో ఉంచుకోవాలి
- పచ్చికూరలు, పండ్లు, గోధుమలు, జొన్నలు, రాగి వంటి ధాన్యాలతో సమతుల ఆహారం తీసుకోవాలి
ఈ సూచనలు పాటిస్తే మధుమేహం పెద్ద సమస్యగా మారకుండా కాపాడుకోవచ్చని వైద్య నిపుణురాలు డాక్టర్ కింజరాపు శర్మిల అన్నారు.


















