సౌదీ అరేబియాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారాన్ని వెంటనే సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద బస్సులో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు సౌదీ ఎంబసీతోనూ సంప్రదించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
- తెలంగాణ సచివాలయం: +91 79979 59754, +91 99129 19545
- జెడ్డాలోని భారతీయ ఎంబసీ: 80024 40003
ఘటనపై ఒవైసీ స్పందన
సౌదీ ప్రమాదం వార్తతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రియాద్‌లోని భారత ఎంబసీతో మాట్లాడి ఘటన వివరాలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న 44 మంది యాత్రికులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురైనట్టు వివరించారు. మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను అభ్యర్థించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని కోరారు.
ప్రమాదం వివరాలు
సౌదీ అరేబియాలో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు మంటల్లో చిక్కుకొని 42 మంది సజీవదహనమయ్యారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే కాగా, మరణించిన వారిలో అధిక సంఖ్యలో హైదరాబాద్ వాసులున్నట్టు సమాచారం. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని విదేశీ మీడియా కథనాలు తెలియజేశాయి.




















