ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే (Amazon layoffs). క్లౌడ్ సర్వీసెస్, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ ఇలా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఇక, ఇంజినీర్ల బృందంపై ఈ లేఆఫ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ భారీ తొలగింపులో 1800 మంది ఇంజినీర్లు ఉన్నారని న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ లేఆఫ్ రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆ రాష్ట్రాల్లో 4,700 మందికిపైగా లేఆఫ్ జాబితాలో ఉంటే.. అందులో 40 శాతం మంది ఇంజినీర్లే ఉన్నారు. ఈమేరకు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. మిగతారాష్ట్రాల్లోనూ అమెజాన్ తమ తొలగింపుల డేటాను బహిర్గతం చేస్తే.. ఏఏ విభాగాల్లో ఎంతమందిని తొలగిస్తున్నారనే దానిపై స్పష్టత వస్తుందని పేర్కొంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెద్దఎత్తున ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల తొలగింపు గురించి అక్టోబర్‌లో అమెజాన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కస్టమర్ల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పంథాలో ముందుకెళుతున్నామని అమెజాన్ (Amazon) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెతత్ గలెట్టి ఉద్యోగులకు రాసిన సందేశంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బ్యూరోక్రసీని తగ్గించి, అనవసర లేయర్లను తొలగిస్తున్నామని, వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నది ఏఐ శకం అని అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో ఈ భారీ లేఆఫ్‌ల ప్రకటన వచ్చింది.




















