దిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్, హరియాణా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు.




















