శస్త్రచికిత్సతో పనిలేకుండా, అనస్థీషియా ఇవ్వకుండా చర్మం మీద చిన్న రంధ్రంతోనే ప్రోస్టేట్ ఉబ్బుకు చికిత్స చేస్తే? ప్రోస్టేట్ గ్రంథిని అసలు ముట్టుకోకుండా, చుట్టుపక్కల భాగాలను తాకకుండా, రక్తస్రావమేదీ లేకుండానే సమస్యను తగ్గిస్తే? అదీ ఒకట్రెండు గంటల్లోనే చికిత్స పూర్తయితే? ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (పీఏఈ) ప్రక్రియ ఇలాంటి సౌకర్యమే కలిగిస్తోంది. మూత్ర విసర్జన చిక్కులతో చికాకు పెట్టే ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బును మూలంలోనే అరికట్టటం దీని ప్రత్యేకత. పెద్ద సమస్యకు తేలికగా పరిష్కారం చూపుతున్న దీనికి రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది.
ప్రోస్టేట్ గ్రంథి మగవారికే ప్రత్యేకం. అందుకే దీన్ని పౌరుష గ్రంథి, అస్థీల గ్రంథి అనీ పిలుస్తుంటారు. ఇది మూత్రాశయం కింద చిన్న నిమ్మకాయ సైజులో మూత్రమార్గం చుట్టూరా కరచుకొని ఉంటుంది. వృషణాల్లో తయారయ్యే శుక్ర కణాలు ప్రోస్టేట్ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే వీర్యం రూపంలో బయటకు వస్తాయి. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ.. ముఖ్యంగా మధ్యవయసు దాటాక లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం వల్ల గ్రంథి సైజు పెద్దగా అవుతూ వస్తుంటుంది. ఇది వయసుతో పాటు తలెత్తే మామూలు మార్పే గానీ క్యాన్సర్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. కాబట్టే దీన్ని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేసియా (బీపీహెచ్) అంటారు. చాలామంది మగవారు జీవితంలో ఎప్పుడో అప్పుడు దీన్ని ఎదుర్కొనేవారేనన్నా అతిశయోక్తి కాదు. యాభై ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఇద్దరు ప్రోస్టేట్ ఉబ్బు బారినపడటం గమనిస్తుంటాం. మధుమేహం, ఊబకాయం వంటివీ దీన్ని ప్రేరేపించొచ్చు. కొందరికి జన్యు స్వభావం రీత్యా మధ్యవయసులోనూ రావొచ్చు.
ఇలా చేస్తారు



శరీరంలో ఏ భాగం సజీవంగా ఉండాలన్నా, వృద్ధి చెందాలన్నా రక్తం కావాలి. మరి రక్తం అందకుండా చేస్తే? కణజాలం చచ్చుబడుతుంది కదా. ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్‌లోని కిటుకు ఇదే. గుండెకు యాంజియోగ్రఫీ చేసినట్టుగా, రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి చికిత్స చేయటం దీని ప్రత్యేకత. ఇందులో గజ్జల వద్ద గానీ మణికట్టు వద్ద గానీ చిన్న రంధ్రం చేసి, సన్నటి గొట్టాన్ని రక్తనాళంలోకి జొప్పిస్తారు. ఇది ఇమేజ్ గైడెడ్ ప్రక్రియ. అంటే లోపలికి వర్ణద్రవ్యాన్ని ఎక్కించి, ఫ్లోరోస్కోపీతో చూస్తూ చేస్తారన్నమాట. ముందు ప్రోస్టేట్ గ్రంథికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని గుర్తిస్తారు. తర్వాత అతి సూక్ష్మంగా, మైక్రాన్ల సైజులో ఉండే పూసలను (ఎంబోస్ఫేర్స్) నాళంలోకి జొప్పిస్తారు. అవి అక్కడే స్థిరపడి, కుదురుకుంటాయి. దీంతో రక్తనాళం మూసుకుపోయి, రక్త ప్రవాహం నిలిచిపోతుంది. ఫలితంగా ప్రోస్టేట్ గ్రంథి సైజు తగ్గుతుంది. మెత్తబడుతుంది కూడా. అందువల్ల మూత్రమార్గం మీద ఒత్తిడి తగ్గి, విసర్జన సాఫీగా అవుతుంది. ఇబ్బందులు తొలగిపోతాయి.
చికిత్స అనంతరం
కొద్దిరోజుల్లోనే రోజువారీ పనులు చేసుకోవచ్చు. ఓ వారం నుంచి పది రోజుల వరకు మూత్రం పోస్తున్నప్పుడు మంట, కొద్దిగా అసౌకర్యం, మూత్రం ఎక్కువసార్లు రావటం, గ్రంథి కణజాలం చచ్చుబడుతూ రావటం వల్ల స్వల్పంగా రక్తం పడటం వంటివి ఉండొచ్చు. అంతకుమించి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు.
- రెండు, మూడు వారాల్లోనే ఫలితం కనిపించటం మొదలవుతుంది. అయితే కణజాలం చనిపోయి, గ్రంథి సైజు పూర్తిగా తగ్గటానికి మూడు నెలలు పట్టొచ్చు. అప్పటివరకూ ప్రోస్టేట్ ఉబ్బుకు వాడుతున్న మందులు కొనసాగించాల్సి ఉంటుంది.
- చికిత్స తీసుకున్నాక పదేళ్లలోపు 20-25% మందికి తిరిగి గ్రంథి పెద్దగా అవ్వచ్చు. వీరికి రెండోసారి చికిత్స అవసరమవుతుంది.
చికాకు పెట్టే లక్షణాలు
ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బుతున్నకొద్దీ మూత్రమార్గాన్ని నొక్కటం మొదలెడుతుంది. ఇది మూత్ర విసర్జనలో ఇబ్బందులు కలగజేస్తుంది.
- పోయటం ఆరంభించినప్పుడు వెంటనే మూత్రం రాకపోవటం
- ధార సన్నబడటం, వేగం మందగించటం
- మూత్రం పోయటానికి ముక్కాల్సి రావటం
- లోపల మూత్రం ఇంకా మిగిలి ఉందని, పూర్తిగా ఖాళీ కాలేదని అనిపించకపోవటం
- మూత్రాన్ని ఆపలేకపోవటం. వస్తున్నట్టు అనిపించిన వెంటనే బాత్రూమ్‌కు పరుగెత్తాల్సి రావటం
- ఎక్కువ సార్లు మూత్రం రావటం. విసర్జన అనంతరం మూత్రం చుక్కలుగా పడటం
- మూత్రం పోయటానికి రాత్రిపూట ఎక్కువసార్లు నిద్ర లేవటం
- కొన్నిసార్లు మంట, నొప్పి కూడా ఉండొచ్చు.
ముదిరితే ప్రమాదం
చికిత్స చేయించుకోవటానికి భయపడి కొందరు ప్రోస్టేట్ ఉబ్బును నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది ప్రమాదకరం. విసర్జన సాఫీగా కాకపోయినా, లోపల మూత్రం మిగులుతున్నా మూత్రాశయం మీద ఒత్తిడి పడి, దెబ్బతినొచ్చు. కొందరికి పూర్తిగా మూత్రం ఆగిపోవచ్చు కూడా. మరీ తీవ్రమైతే కిడ్నీలూ దెబ్బతినే అవకాశముంది.
మందులు, శస్త్రచికిత్సలున్నాయి గానీ
ప్రోస్టేట్ ఉబ్బినా అందరికీ చికిత్స అవసరముండకపోవచ్చు. లక్షణాలు ఇబ్బంది పెడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వీరికి సాధారణంగా ఆల్ఫా బ్లాకర్లు ఇస్తుంటారు. ఇవి గ్రంథిలోని మృదు కణజాలాన్ని వదులుగా చేస్తాయి. కొందరికి 5 అల్ఫా రిడక్టేస్ ఇన్‌హిబాటర్స్ రకం మందులిస్తారు. ఇవి యాక్టివ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదులను తగ్గించటం ద్వారా సైజు పెరగకుండా చూస్తాయి. అయితే హార్మోన్ మందుల వాడకంపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరికి మూడ్ మారటం, లైంగికాసక్తి తగ్గటం వంటి దుష్ప్రభావాలు ఉండొచ్చు.
- మాత్రలతో ఫలితం కనిపించనివారికి ట్రాన్స్‌యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ (టీయూఆర్‌పీ), లేజర్ అబ్లేషన్, ట్రాన్స్‌యురెత్రల్ వాటర్ వేపర్ థెరపీ (రెజమ్), యూరో లిఫ్ట్ వంటి శస్త్రచికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ మూత్రమార్గం లోపలి నుంచి గొట్టాన్ని పంపించి, చేసేవే. ఇవి కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించొచ్చు. కొన్ని చికిత్సల్లో గ్రంథిని మొత్తంగా గానీ కొంత భాగాన్ని గానీ కత్తిరించి, తొలగిస్తారు. వీళ్లు కోలుకోవటానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కొందరికి సర్జరీ అనంతరం మూత్రమార్గంలో ఎక్కువరోజులు పైపు పెట్టుకోవాల్సి రావొచ్చు. ఇలాంటి దుష్ప్రభావాలను తగ్గించటానికే ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తున్నారు. ఇక్కడే ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రక్రియ ఆదుకుంటోంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన ప్రక్రియ. అమెరికా ఎఫ్‌డీఏ వంటి అంతర్జాతీయ సంస్థలెన్నో దీనికి అనుమతించాయి.
కొన్ని పరీక్షలు
పీఏఈ చికిత్సకు ముందు అది వయసుతో పాటు వచ్చిన మార్పా? క్యాన్సరా? ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నాయా? అనేది తెలుసుకోవటం ముఖ్యం. అందువల్ల కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.
- ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్‌ఏ): ఇది నార్మల్‌గా ఉంటే వయసుతో పాటు వచ్చిన ఉబ్బుగా భావిస్తారు. ఎక్కువుంటే క్యాన్సర్ ఉండే అవకాశముంది. అప్పుడు బయాప్పీ వంటి ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
- గ్రంథి తీరుతెన్నులను తెలిపే అల్ట్రాసౌండ్, మూత్ర ప్రవాహాన్ని సూచించే యూరోఫ్లోమెట్రీ పరీక్షలూ చేస్తారు.
ప్రయోజనాలు ఎన్నెన్నో..
- చిన్న రంధ్రంతోనే: పీఏఈలో ప్రోస్టేట్ గ్రంథికి కోత పెట్టాల్సిన అవసరముండదు. చర్మం మీద చిన్న రంధ్రం గుండానే చేస్తారు.
- గొట్టం వేయరు: ఇతర ప్రోస్టేట్ శస్త్రచికిత్సల మాదిరిగా ఇందులో మూత్రమార్గం గుండా గొట్టం వేయాల్సిన పనుండదు. అందువల్ల సౌకర్యంగా ఉంటుంది.
- శృంగార జీవితం హాయిగా: కొన్ని ఇతర శస్త్రచికిత్సల మాదిరిగా ఇందులో స్తంభనలోపం, వీర్యం వెనక్కి వెళ్లటం వంటి దుష్ప్రభావాలు ఉండవు. శృంగార జీవితం హాయిగా సాగుతుంది.
- త్వరగా కోలుకోవటం: అనస్థీషియా ఇవ్వకపోవటం, రక్తస్రావం లేకపోవటం వల్ల త్వరగా కోలుకుంటారు. ఒకట్రెండు గంటల్లోనే చికిత్స పూర్తవుతుంది. అదే రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు.
- పెద్ద గ్రంథులకు ఉపయుక్తం: ఇతర ప్రక్రియల్లో గ్రంథి పెద్దగా ఉంటే చికిత్స కష్టమవుతుంది. కానీ గ్రంథి ఎంత పెద్దగా ఉన్నా పీఏఈ చేయొచ్చు. గ్రంథి బరువు 40 గ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నవారికిది బాగా ఉపయోగపడుతుంది.
- సర్జీరీ వీలుకానప్పుడూ: సర్జరీలు సాధ్యం కానివారికి, సర్జరీ ఇష్టం లేనివారికి, మత్తుమందు తట్టుకోలేనివారికి ఇది మంచి అవకాశం. ఆ భాగంలోనే మత్తు కలిగేలా చేస్తారు కాబట్టి 75, 80 ఏళ్లు పైబడ్డవారికీ చేయొచ్చు.
- ఇలాంటి ప్రయోజనాల మూలంగానే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రోస్టేట్ ఉబ్బుకు ప్రధాన చికిత్సల్లో దీన్ని ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇతర దేశాల్లో చాలామంది ఇప్పుడు దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవితాంతం మందులు వాడుకోవటం కన్నా ఒకట్రెండు గంటల్లోనే ముగిసే పీఏఈకే మొగ్గు చూపుతున్నారు. కాకపోతే అధునాతన 3డీ ఇమేజింగ్ సదుపాయాలున్న క్యాథ్‌ల్యాబ్‌లో, మంచి నిపుణులతో చేయించుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.



















