బయాలజీ ఫస్ట్ మెథడ్‌గా, ఇంగ్లిష్ సెకండ్ మెథడ్‌గా బీఈడీ చేశాను. ఈ కోర్సుతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువ. బయాలజీ, ఇంగ్లిష్ లాంటి రెండు మెథడాలజీలతో బీఎడ్ చేసిన మీకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగావకాశాలుంటాయి.
ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో, సోషల్/ బీసీ/ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పోస్టులుంటాయి. వీటితోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలూ, మోడల్, ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలుంటాయి. కేంద్రప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సైనిక్ పాఠశాలల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వరంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి.
ప్రైవేటు రంగంలో హైస్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు. మీకు ఇంగ్లిష్ రెండో మెథడ్‌గా ఉన్నందున.. ఆసక్తి ఉంటే ఇంగ్లిష్ కూడా బోధించవచ్చు.
ఎమ్మెస్సీ (బోటనీ/ జువాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ జెనెటిక్స్/ సైకాలజీ/ కెమిస్ట్రీ) లేదా ఎంఏ (ఇంగ్లిష్) లాంటి పీజీలు చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు.
బయాలజీ, ఇంగ్లిష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ప్రైవేటు కోచింగ్ సెంటర్లు, ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా కొన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకొని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చు.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ/ ఇంగ్ల్లిష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చు.
యూట్యూబ్ చానెల్స్ ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవచ్చు.
అదనంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లాంటి అవకాశాల గురించి ఆలోచించవచ్చు.




















