ఢాకా, కోల్‌కతా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీంతో 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వివిధ ప్రాంతాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు అంటుకొని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7గా నమోదైంది. ఈ భూకంపం నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని పలు ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. బంగ్లాదేశ్‌లోని నర్సింగ్దీ ప్రాంతానికి నైరుతి దిక్కున 13 కి.మీల దూరంలో, 10 కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఈ భూకంపం కారణంగా సంభవించిన ప్రకంపనలతో కోల్‌కతా సహా అస్సాంలోని గువాహాటి ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.




















