అమరావతి: రాష్ట్రంలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా (యూనివర్సల్ హెల్త్ పాలసీ)ను అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే (బీపీఎల్) కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఏపీఎల్ వర్గాలకు 2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వెచ్చిస్తున్నామో విశ్లేషించాలని సూచించారు.
ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యురేటివ్ విధానం ద్వారా వైద్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతోపాటు ప్రజల వ్యక్తిగత ఖర్చులు కూడా తగ్గేలా చూడాలని స్పష్టంచేశారు.
పేదలకు మెరుగైన సేవలకే ‘పీపీపీ’
పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య కళాశాలలను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. “వైద్య కళాశాలలు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నా, పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానిదే. వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు ఇక గ్రామీణ ప్రాంతాలకు అందుతాయి. ప్రజలకు, విద్యార్థులకు, చివరికి సమాజం మొత్తానికి వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఆసుపత్రుల్లో 70 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నాం. వైద్య సేవలు కూడా ఉచితంగా అందుతాయి” అని తెలిపారు.
పీపీపీ కింద తొలి విడతలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలల పనులపై సీఎం ఆరా తీశారు. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో నాలుగు దశలు పూర్తయ్యాయని, వచ్చే నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఒక్కో కళాశాల నిర్మాణానికి 50 ఎకరాలు కేటాయించామని, అందులో 25 ఎకరాల్లో వైద్య కళాశాల–ఆసుపత్రి, మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్, ఆయుర్వేద, వెల్‌నెస్ సెంటర్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎంను సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రి మోడళ్లను అధ్యయనం చేసి, రోగులకు నాణ్యమైన, మెరుగైన సేవలను సులభంగా అందించాలని ఆయన అన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలని, నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ప్రమాణాలు ఉండాలని ఆదేశించారు.
రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా ‘సంజీవని’
కుప్పంలో పైలట్‌గా అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు రాష్ట్ర వైద్యరంగానికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. టాటా–బిల్‌గేట్స్ ఫౌండేషన్‌లతో కలిసి అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శం కావాలని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించబోతున్నామని తెలిపారు. కుప్పంలో 3.38 లక్షల మంది ఆరోగ్య వివరాలు సేకరించాలని సూచించారు. సేకరించిన డేటాను విశ్లేషించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక నేచురోపతి ఆసుపత్రితో పాటు యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పారు.
కుప్పంలో రిజిస్టర్ అయిన వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ద్వారా కుప్పం ప్రజల ఆరోగ్య రికార్డులు రూపొందించామని చెప్పారు. ఇప్పటికే 49 వేల మంది రోగుల డేటా సేకరించామని తెలిపారు. 2026 జనవరి 1 నుంచి చిత్తూరు జిల్లా మొత్తం సంజీవని ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ వైద్యసేవకు ఆసుపత్రుల నుంచి ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్‌లు వస్తున్నాయని, నెలకు రూ.330 కోట్లు ఖర్చవుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వీసీ ద్వారా మంత్రి సత్యకుమార్ పాల్గొనగా, సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శులు సౌరభ్ గౌర్, వీరపాండియన్ పాల్గొన్నారు.



















