నేటి మాట
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం ।
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్
భావం : భక్తి అంటే ఈ తొమ్మిది రకాల కర్మల్లో దేనినైనా ఆచరించడం:
శ్రవణం (దేవుని కథలు వినడం), కీర్తనం (నామ సంకీర్తన), స్మరణం (భగవంతుని తలవడం), పాద సేవనం (భగవంతుని సేవ), అర్చనం (పూజించడం), వందనం (నమస్కరించడం), దాస్యం (సేవకునిగా ఉండటం), సఖ్యం (స్నేహంగా ఉండటం), ఆత్మ నివేదనం (సమర్పణ).
మానవ జన్మ ప్రయోజనం:
ఈ నరజన్మ, కేవలం జంతువులు పొందే భోగముల కోసం కాదు. ఇది దివ్యమైన తపస్సు చేయడానికే ఉద్దేశించబడింది.
సారం :
మానవ శరీరాన్ని కేవలం భోగాల కోసం వినియోగించకూడదు, దైవచింతన, తపస్సు ద్వారా మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం.
జీవన విధానంలో – ధర్మం ఎందుకు ఆచరించాలి?
ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే. ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక. ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం. ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం. అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది. అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.
ఈ పవిత్ర జీవనం కోసమే మనపెద్దలు ధర్మం ఆచరించమన్నారు.“`
శ్రీ సద్గురు పీఠం నుండి….




















