భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కి అనుబంధంగా ఉన్న న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని జీనోమ్ వ్యాలీలో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలతో ఈ సంస్థ పని చేయనుంది. కాంట్రాక్టు పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి సేవల (CRDMO) రంగంలో పనిచేసే న్యూసెలియన్ ప్రధానంగా కణ మరియు జన్యు చికిత్సలపై దృష్టి పెట్టింది.
క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అరుదైన జన్యు రుగ్మతలకు అధునాతన వైద్య పరిష్కారాలను అందించడం సంస్థ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఔషధ పరిశోధనలలో బయోలాజికల్ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని, ఈ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతాయని భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు మరియు న్యూసెలియన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. కణ మరియు జన్యు చికిత్సలు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని ఆయన అన్నారు.
అత్యంత క్లిష్టమైన వ్యాధులకు సమర్థవంతమైన పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని న్యూసెలియన్ థెరప్యూటిక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) రఘు మలపాక తెలిపారు. క్లినికల్ దశ నుండి వాణిజ్య స్థాయి ఉత్పత్తి వరకు సమగ్ర సేవలను అందించేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. ప్లాస్మిడ్ డీఎన్‌ఏ, వైరల్ వెక్టార్స్, ఆటోలోగస్, అల్లోజెనీక్ సెల్ థెరపీల అభివృద్ధి, తయారీ రంగాల్లో సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.




















