అమరావతి:
మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం నుండి సమీక్షించారు. ఆర్టీజీఎస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, మంత్రులు పాల్గొన్నారు.
ప్రస్తుతం మొంథా తుఫాన్ కాకినాడకు సుమారు 680 కిలోమీటర్ల దూరంలో ఉండి, గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరానికి దగ్గరవుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈరోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రేపు రాత్రి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాన్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంలో ప్రధాని కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్‌కు సీఎం సూచించారు.
వర్షాలు, వరదల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువ గట్లు బలపరచి పంట నష్టం జరగకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశించారు.
ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సీఎస్, మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.























