అమరావతి, అక్టోబర్ 31:
మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన రక్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ అనంతర చర్యలపై సమీక్షించారు.
శాటిలైట్ చిత్రాల ద్వారా నీట మునిగిన ప్రాంతాలను గుర్తించి, శనివారం కల్లా నీటి నిల్వలను పూర్తిగా మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గాలవారీగా చిత్రాలను విడుదల చేసి, ఎక్కడ నీరు నిలిచిపోయిందో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.
పంటల దిగుబడిపై ప్రభావం పడకుండా శాస్త్రవేత్తల సూచనలతో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో బాపట్ల జిల్లాలోనే సుమారు 60% వ్యవసాయ భూముల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు వివరించగా, ఆదివారం నాటికి నీటి నిల్వలు తొలగిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రానికి నివేదిక, తక్షణ సాయం కోరాలని ఆదేశం
మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై తక్షణమే ప్రాథమిక నివేదికను కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలని సూచించారు. తుది నివేదిక సమర్పణకు ముందు కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ విషయంలో తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని సీఎం తెలిపారు. కృష్ణా నదిలో నీటి నిల్వల పరిస్థితిపై కూడా ఆయన అధికారులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని అధికారులు తెలిపారు.
తుఫాన్ విధుల్లో ప్రతిభ చూపిన వారికి సన్మానం
మొంథా తుఫాన్ సమయంలో రక్షణ చర్యల్లో అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందిని సన్మానించాలని సీఎం ఆదేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు సుమారు 100 మంది సిబ్బందికి గౌరవ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
సమష్టిగా పనిచేస్తేనే ప్రజలకు భరోసా కలిగించగలమని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.




















