వరంగల్: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని 12 జిల్లాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎకరాకు ₹10,000 పరిహారం, మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు, నీటమునిగిన ఇళ్లకు ₹15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. నిర్వాసితులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే విషయాన్ని కూడా పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం సీఎం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. సమ్మయ్యనగర్, కాపువాడ, పోతననగర్‌లలో కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తదుపరి హనుమకొండ కలెక్టరేట్‌లో ఏడు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం, నష్టాలపై వెంటనే నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పశువులు చనిపోతే తగిన పరిహారం ఇవ్వాలని సూచించారు. ఇసుక మేటలు ఏర్పడిన ప్రాంతాల్లో కూడా నష్టం అంచనా వేయాలన్నారు. కేంద్ర నిధులు పొందేందుకు నిర్దిష్ట విధానంలో నివేదికలు పంపాలని హెచ్చరించారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పుల వల్ల తరచుగా క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా ప్రతినిధులతో సమన్వయం కలిగి నష్ట వివరాలు సేకరించాలన్నారు. నాలాలపై అక్రమ కబ్జాలను కఠినంగా తొలగించాలని ఆదేశించారు. “ఎవరైనా కావొచ్చు, కబ్జాలు వదిలిపెట్టకండి. శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయండి,” అని సీఎం స్పష్టం చేశారు.
పర్యటనలో సీఎం వరద బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. రేకుల షెడ్డుల్లో తాత్కాలికంగా నివసిస్తున్న బాధితుల ఇళ్లలోకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయని బాధితులు వివరించగా, వారికి సర్టిఫికెట్లు అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేద కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి సూచించారు.
తదుపరి కాపువాడ, పోతననగర్ ప్రాంతాల్లో వరద ముంపు సమస్యలను పరిశీలించారు. భద్రకాళి చెరువు వద్ద నాలా విస్తరణ అవసరమని గుర్తించి, శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కు ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అదే రోజు సీఎం హెలికాప్టర్‌లో సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాలపై ఏరియల్ సర్వే నిర్వహించి, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.


















