విజయవాడలో మొంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని సీపీ వెల్లడించారు.
అదే సమయంలో మున్నేరు, బుడమేరు వాగులు, కాలువల పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాగులు పొంగుతున్నాయంటూ కొందరు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అలాంటి వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్నేరు, బుడమేరు సహా అన్ని వాగులు, కాలువలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ప్రజలకు సకాలంలో సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
- కలెక్టరేట్: 9154970454
- వీఎంసీ కార్యాలయం: 0866-2424172, 0866-2422515, 0866-2427485
ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.



















