భారత్‌కు ఉన్న బలమైన ఆర్థిక మూలాలను పరిగణనలోకి తీసుకుని భారత దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ ఇష్యూయర్ రేటింగ్స్, దేశీయ కరెన్సీ అన్‌సెక్యూర్డ్ రేటింగ్‌ను అంతర్జాతీయ ఏజెన్సీ మూడీస్ ‘బీఏఏ3’గా నిర్ణయించింది. బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా భవిష్యత్తు అంచనాలనూ ‘స్థిరం’గా కొనసాగించింది. ఇతర స్వల్పకాల దేశీయ రేటింగ్‌ను పీ-3 వద్ద ఉంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా శిరీష్ చంద్ర ముర్మును ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. అక్టోబరు 9 నుంచి మూడేళ్ల పాటు ముర్ము నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదేళ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం నాలుగు రెట్లకుపైగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘ఎన్విరాన్‌మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్-2025’ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2013-14లో రాష్ట్రంలో దట్టమైన అటవీ విస్తీర్ణం 375 చదరపు కిలోమీటర్లు. 2021-22కు అది 1,995.71 చ.కి.మీ.లకు చేరింది. 1,620.71 చ.కి.మీ. నికర వృద్ధి (432.19%) నమోదైంది.
ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకశాఖ 2025, సెప్టెంబరు 27న వెల్లడించింది. దేశంలోని అన్ని పురాతన కట్టడాల కంటే తాజ్‌మహల్ టికెట్లే అధికంగా అమ్ముడు పోయాయని, 62.6 లక్షల మంది స్వదేశీయులు, 6.45 లక్షల మంది విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శించారని తెలిపింది.



















