విశాఖపట్నం: మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం అంతటా వాతావరణం ఆందోళనకరంగా మారింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు కురుస్తుండగా, అనేక జిల్లాల్లో ఈదురుగాలులు కూడా వీచుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే చిరుజల్లులు మొదలయ్యాయి. కాకినాడలో ఉదయం నుంచి వర్షం తీవ్రత పెరుగుతూ ఉండగా, విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదైంది.
వాతావరణ శాఖ అధికారులు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వచ్చే ఐదు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అమల్లోకి వచ్చాయి. అలల ఉద్ధృతి పెరగడంతో రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
అధికారుల అంచనాల ప్రకారం, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు. తీరప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.




















