ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్(JEE Main 2026) పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు అలర్ట్! ఈ పరీక్ష రాసే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పలు కీలక సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ సెషన్ 1, ఏప్రిల్‌లో సెషన్-2 పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెషన్ 1 పరీక్షకు అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులోకి వస్తాయని వెల్లడిస్తూ అభ్యర్థులకు పలు డాక్యుమెంట్‌ల అప్‌డేట్‌కు సంబంధించి పలు కీలక సూచనలు చేసింది.
జేఈఈ (మెయిన్) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.
- ఆధార్: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం) సరిగా ఉండేలా అప్‌డేట్ చేసుకోండి. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు మీ కార్డులో అప్‌డేట్ అయి ఉండాలి.
- దివ్యాంగ అభ్యర్థులైతే..: యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్ చేయించుకొని అప్‌డేట్‌గా ఉండటం తప్పనిసరి.
- కేటగిరీ సర్టిఫికెట్: కేటగిరీ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్)ను చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోండి.
అలాగే, అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోవాలని ఎన్‌టీఏ డైరెక్టర్ (పరీక్షలు) ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తద్వారా జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన నోటీసులు, ఇతర అప్‌డేట్స్ తెలుసుకోవచ్చన్నారు.




















