తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు కొనసాగటంతో ప్రజల్లో భయాందోళనలు తీవ్రంగా పెరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ఓ కారు బోల్తాపడి ప్రమాదానికి గురైంది. అదే సమయంలో కరీంనగర్ జిల్లాలో ట్రాలీ ఆటో కూడా బోల్తాపడింది. ఈ రెండు ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
భాగ్యనగరంలోని ఫ్లైఓవర్‌పై శనివారం కారు బోల్తాపడింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపుకు వెళ్తున్న కారు టైర్ దెబ్బతినడంతో పిల్ లర్ నెంబర్ 25 వద్ద డివైడర్‌ను ఢీకొని కారు బోల్తాపడింది. కారులో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు కాగా, ఘటనక్రమంలో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
అలాగే, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల శివారులో శనివారం మహిళా వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్ర గాయపడ్డారు, మరికొందరికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరి సహాయం చేశారు. పోలీసులు ట్రాలీ వేగంగా వెళ్లిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు ఎల్బాక గ్రామం నుంచి నాగారం గ్రామానికి పత్తి తీయడానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలని తెలిపారు.




















