‘మొంథా’ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీల్లోకి నీరు చేరడంతో, మోతీనగర్‌లో 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఖమ్మం–బోనకల్ రహదారిపై రాకపోకలు నిలిపివేత
మున్నేరులో వరద మట్టం 24.7 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రవాహం ఇంకా పెరుగుతోంది. వరద నీరు ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపైకి రావడంతో దంసలాపురం వద్ద రహదారిపై మూడు అడుగుల వరద నీరు చేరింది. జాగ్రత్త చర్యగా పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేసి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతకాని మండలంలోని రామకృష్ణాపురం సమీపంలో ఉన్న లో లెవెల్ వంతెనపైనా వరద ప్రవహిస్తోంది.
పాలేరు జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
పాలేరు జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు వస్తోంది. రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. టీఎన్జీవోస్ కాలనీని నలువైపులా వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదులాపురం పరిధిలోని కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల చుట్టూ కూడా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.





















