ఇంటర్నెట్ డెస్క్: బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేయనున్నారు. సోమవారం సదరు సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుని దానిని మించి ఘన విజయం సాధించింది. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య వంటి నటులు ఈ ప్రీక్వెల్‌లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 13వ స్థానాన్ని దక్కించుకుంది.
ఇక, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల కానుంది.
కథ సారాంశం:
8వ శతాబ్దం నాటి కదంబుల రాజ్యం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఆ రాజ్యంలో ఉన్న కాంతార అనే పవిత్ర అటవీ ప్రదేశం దైవిక శక్తులతో నిండి ఉంటుంది. ఆ ప్రాంతంలోని దేవుని పూదోట, మార్మిక బావి ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పవిత్ర భూమిని బాహ్య దుష్టశక్తుల నుండి కాపాడటమే ఆ ప్రాంత గిరిజన తెగ ధర్మంగా భావిస్తుంది.
ఒకరోజు ఆ బావిలో దొరికిన శిశువును దేవుని వరమని భావించి బెర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. తరువాత భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్ దేవయ్య) తమ రాజ్యంలోకి చొరబడ్డప్పుడు బెర్మే అతనికి తగిన శిక్షను అందిస్తాడు. ఆ తర్వాత రాజ్యంలోని వ్యాపార, దోపిడీ, గిరిజనులపై జరిగే అణచివేతల నిజాలను తెలుసుకున్న బెర్మే తిరుగుబాటుకు సిద్ధమవుతాడు.
తన నిర్ణయాలతో కాంతార తెగకు ముప్పు ఎందుకు వచ్చింది? తన ధర్మాన్ని ఎలా కాపాడాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘కాంతార చాప్టర్ 1’.
మొత్తం మీద, అద్భుతమైన విజువల్స్, బలమైన కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో మంత్ర ముగ్ధులను చేసిన తర్వాత, ఇప్పుడు ఓటీటీలో కొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.



















