జితేష్, వంశీ మూడో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇద్దరూ స్కూల్‌కి వెళ్లారు. ఇంటర్వెల్ సమయంలో వంశీ.. ‘పక్కనే షాప్‌లో చాక్లెట్లు కొనుక్కుందామా?’ అని జితేష్‌తో అన్నాడు. ‘చాక్లెట్స్ అంటే గుర్తొచ్చింది.. ఫ్రెండ్స్‌కి ఇవ్వమని అమ్మ కొన్ని చాక్లెట్స్ ఇచ్చింది’ అంటూ బ్యాగ్‌లో నుంచి తీశాడు జితేష్. ‘అవునా..! సరే అవి నువ్వే అందరికీ పంచు’ అన్నాడు వంశీ. ‘నేనే పంచుతాను గానీ.. ఇన్ని చాక్లెట్లు అందరికీ సమానంగా ఎలా పంచాలా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు జితేష్. ‘ఏముంది ముందు ఒక్కోటి ఇవ్వు. మిగిలితే మళ్లీ ఇంకో రౌండ్’ అన్నాడు వంశీ. సరేనన్నాడు జితేష్. క్లాస్‌లో ఉన్న అందరికీ చాక్లెట్లు పంచడం మొదలుపెట్టాడు. ఒక రౌండ్ అయిపోయింది. అయినా ఇంకా చాలా చాక్లెట్స్ మిగిలిపోయాయి. మళ్లీ ఇంకో మూడు రౌండ్లు పంచాడు. ఇంకా నాలుగు చాక్లెట్లు మిగిలాయని వంశీ దగ్గరికి వెళ్లి చెప్పాడు. అప్పుడా అబ్బాయి.. ‘మొత్తం మన క్లాస్‌లో ఎంతమంది ఉన్నారు. ఎన్నిసార్లు పంచావు’ అని అడిగాడు. ‘పదిహేను మంది ఉన్నారు. నాలుగుసార్లు పంచాను’ బదులిచ్చాడు జితేష్. ‘అయితే పదిహేనుని నాలుగుతో హెచ్చవేసి ఎంత వచ్చిందో చెప్పు’ అన్నాడు వంశీ. ‘అరవై వచ్చింది.. దానికి మిగిలిన నాలుగు చాక్లెట్లు కలిపితే అరవై నాలుగు’ అన్నాడు జితేష్. ‘అంతే! మరి నిన్నటి వరకూ నాకు మ్యాథ్స్ రావట్లేదు.. అర్థంకావట్లేదు అన్నావు కదా! ఇలా మనం రోజూ చేసే పనులను మ్యాథ్స్‌తో పోల్చుకుంటే చాలా ఈజీగా చేసేయొచ్చు’ అన్నాడు వంశీ. ‘అయితే.. ఈరోజు ఇంటికి వెళ్లగానే ఈ విషయం అమ్మతో చెబుతాను’ సంతోషంగా అన్నాడు వంశీ. ఇక ఇద్దరూ కలిసి క్లాస్‌లోకి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లగానే.. ‘అమ్మా! ఇన్నిరోజులు మ్యాథ్స్ అంటే భయపడిపోయాను కదా! కానీ కాస్త ఆలోచిస్తే సులభంగా చేసేయొచ్చని ఈరోజు అర్థమైంది’ అన్నాడు జితేష్. ‘చాలా సంతోషం నాన్నా! మొత్తానికి నీకైతే భయం పోయింది కదా! ఇప్పటి నుంచి చక్కగా నేర్చుకో’ అంది అమ్మ. అలాగేనంటూ హోంవర్క్ చేసుకోసాగాడు జితేష్.














