రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. తుఫాన్ తీవ్రంగా ప్రభావితమయ్యే నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే పరిస్థితుల్లో ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తీరప్రాంతాలు, లంక గ్రామాల్లో ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు.
వర్షాల కారణంగా అంటురోగాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌లు, మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఇబ్బందులు తలెత్తకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఇసుక బస్తాలు, యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, పంట పొలాల్లో నీరు నిలిచిపోకుండా ఆయిల్ మోటార్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. మొంథా తుఫాన్ పరిస్థితులను గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సాయం అవసరమైనా యంత్రాంగం 24×7 సిద్ధంగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.



















