బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మొంథా తుపాను వేగంగా తీవ్రత పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా సుమారు 520 కిలోమీటర్ల దూరంలో, అలాగే పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపాను ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని అంచనా.
వాతావరణ కేంద్రం ప్రకారం, మొంథా తుపాను రేపు (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య, కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది.
తీరానికి తాకే సమయానికి గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా, కాకినాడ తీర ప్రాంతంలో మీటరు ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి.
వాతావరణ శాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర యాత్రలు చేయరాదని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.




















