ప్రతి ఏడాది పెరుగుతున్న భక్తుల సౌకర్యాలను మరింతగా అందించడానికి 2,000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అమరావతి: తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖకు ప్రతిపాదన పంపాలని పేర్కొన్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం రానున్న దృష్ట్యా.. ఆలయ అభివృద్ధిపై ఆయనతో చర్చించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రణాళికలపై దేవాదాయ, అటవీ శాఖల అధికారులతో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆదివారం సమీక్షించారు.
‘శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నారు. రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పించాలి. దోర్నాల, సున్నిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జాతీయ రహదారులను శ్రీశైలం క్షేత్రానికి అనుసంధానించాలి. దీన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి’ అని సీఎం పేర్కొన్నారు.
‘తిరుమల తర్వాత రెండో అతి పెద్ద ఆలయంగా అభివృద్ధి చెందుతున్న శ్రీశైలంలో సరైన పార్కింగ్ సదుపాయాలు లేవు. భూమి లేకుండా పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించలేం. దిల్లీలోని అటవీ మంత్రిత్వ శాఖను అధికారుల బృందం కలిసి పరిస్థితిని వివరించాలి. ఆలయ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకూ చర్యలు తీసుకోవాలి. అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
శబరిమలలో సౌకర్యాలను పరిశీలించాలి..
అటవీ ప్రాంతంలో ఉన్న శబరిమల ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధ్యయనం చేసి, అందుకు అనుగుణంగా శ్రీశైలం క్షేత్రం అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి సూచించారు.



















