ప్రగతికి పరిశోధనలే ప్రామాణికం. అందులోనూ సైన్స్ కోర్సుల్లో ఇవెంతో కీలకం. ఈ సబ్జెక్టులకున్న ప్రాధాన్యం దృష్ట్యా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో పరిశోధనలు చేసుకుంటూ, ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు. ఇందుకోసం సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్లో అర్హత సాధించాలి. ఈ స్కోరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడటానికీ, ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికీ ఉపయోగపడుతుంది. ఇటీవలే ప్రకటన వెలువడింది.
ఏడాదికి రెండు సార్లు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తోంది. సైన్స్, ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల యూజీ లేదా పీజీ పూర్తిచేసుకున్నవారూ, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. కెమికల్ సైన్సెస్ 2. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్ 3. లైఫ్ సైన్సెస్ 4. మ్యాథమెటికల్ సైన్సెస్ 5. ఫిజికల్ సైన్సెస్‌లలో పరీక్ష నిర్వహిస్తారు.
నాలుగేళ్ల యూజీ కోర్సులైన బీఈ, బీఎస్, బీఫార్మసీ…మొదలైన వాటితో జేఆర్ఎఫ్, పీహెచ్‌డీలో ప్రవేశానికి అనుమతిస్తారు. పీజీ లేనందున అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత ఉండదు. నెట్లో అర్హత కోసం 3 కేటగిరీల్లో అవసరమైనదాన్ని ఎంచుకోవచ్చు.
కేటగిరీ-1: జేఆర్ఎఫ్. ప్రతి నెలా నిర్దేశిత స్టైపెండ్ పొందుతూ పరిశోధన (పీహెచ్డీ) కొనసాగించుకోవచ్చు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, జేఆర్ఎఫ్ లేకుండా జరిపే పీహెచ్డీ ప్రవేశాలకూ అర్హులే.
కేటగిరీ-2: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హులు.
కేటగిరీ-3: పీహెచ్‌డీలో ప్రవేశానికే అర్హులు.
బహుళ ప్రయోజనాలు
- జేఆర్ఎఫ్ అవకాశం వచ్చినవారికి తొలి రెండేళ్లు ప్రతి నెలా రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్ అర్హత పొందితే ప్రతి నెలా రూ.42,000 చొప్పున అందుతుంది. ఉచిత వసతి కల్పిస్తారు లేదా స్టైపెండ్‌లో 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, జాతీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడొచ్చు.
- డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యా సంస్థలు నెట్ మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి.
- పలు పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ ఈ స్కోరు ఉంటే ప్రాధాన్యమిస్తున్నాయి.
- జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికీ నెట్ తప్పనిసరి.
పరీక్ష ఎలా?
ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 200 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
పార్టు ఏ: అందరికీ ఈ విభాగం ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్‌లో లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ మొదలైన అంశాల్లో 20 ప్రశ్నలు వస్తాయి. వీటిలో 15 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే చాలు. ఈ విభాగానికి 30 మార్కులు. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
పార్టు బీ: ఎంచుకున్న సబ్జెక్టుల్లో 25 నుంచి 50 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. సబ్జెక్టు ప్రకారం 70 లేదా 75 మార్కులు ఈ విభాగానికి ఉంటాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం చొప్పున తగ్గిస్తారు.
పార్టు సీ: ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 30 నుంచి 80 వరకు ప్రశ్నలు వస్తాయి. ఛాయిస్ ఉంది. మ్యాథ్స్‌లో 95 మిగిలిన సబ్జెక్టుల్లో వంద మార్కులకు ఈ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్ తప్ప మిగిలిన వాటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్, ప్లానిటరీ సైన్సెస్‌లో ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు, మిగిలిన సబ్జెక్టుల్లో పావు శాతం తగ్గిస్తారు.
అర్హత కోసం..
- మీ సబ్జెక్టు సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ సమగ్రంగా పరిశీలించాలి. అధ్యయనాన్ని అందులోని అంశాలకే పరిమితం చేయాలి.
- ప్రాథమికాంశాల నుంచి సన్నద్ధత మొదలవ్వాలి. ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా చదవాలి. రెండు మూడు అంశాలు కలిపి లేదా అనువర్తన రూపంలో ప్రశ్నలు కొంచెం కఠినంగా వస్తాయి. అందువల్ల పూర్తి అవగాహనతో సమగ్రంగా చదవడం తప్పనిసరి.
- సిలబస్‌లోని అంశాల ప్రకారం.. ముందు ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, అనంతరం పీజీ, ఆ తర్వాత రిఫరెన్స్ పుస్తకాలు చదవాలి. తక్కువ పుస్తకాలనే ఎక్కువసార్లు అధ్యయనం చేయాలి.
- అన్ని అంశాలూ చదివిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను శ్రద్ధగా గమనించాలి. ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని ఏ స్థాయిలో చదవాలో తెలుసుకుని, ఉన్న వ్యవధిలో ఆచరించాలి.
- అన్ని సబ్జెక్టుల్లోనూ పార్టు సీ కి వెయిటేజీ ఎక్కువ. ఇందుకోసం ప్రామాణిక పుస్తకాలు, పరిశోధన జర్నల్స్‌ను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
- సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పదైనా మాక్ పరీక్షలు రాసి, బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
- రుణాత్మక మార్కులు ఉన్నందున, ఏ మాత్రం తెలియనివాటిని వదిలేయాలి.
ముఖ్య వివరాలు
అర్హత: ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులవారైతే.. ఎందులోనైనా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్, ఓబీసీలు, 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మసీ తదితర కోర్సులవారికి డిగ్రీలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ విభాగాలైతే 70 శాతం సరిపోతాయి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్ఎఫ్కు డిసెంబరు 1, 2025 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఓబీసీ-ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్, మహిళలకు ఐదేళ్లు మినహాయింపు వర్తిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీకి గరిష్ఠ వయసు నిబంధన లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు గడువు తేదీ: 24.10.2025
పరీక్ష ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1150, జనరల్- ఈడబ్ల్యుఎస్, ఓబీసీ- నాన్ క్రీమీలేయర్‌కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకు రూ.325.
పరీక్ష తేదీ: 18.12.2025
వెబ్సైట్: https://csirnet.nta.nic.in/




















