ఒక్క ఇంజెక్షన్ మందుతోనే క్యాన్సర్ నయమైతే? ఆశ్చర్యమే కదా. ఇది సాధ్యమేనని మనుషులపై నిర్వహించిన తొలి ప్రయోగ పరీక్షలో తేలింది. సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ రకానికి చెందిన ఈ మందు పేరు 2141.వీ11. నిజానికి గత 20 ఏళ్లుగా సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ మందుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవి జంతువుల్లో మంచి ఫలితం చూపిస్తున్నప్పటికీ మనుషులపై అంతగా ప్రభావం కనిపించటం లేదు. పైగా శరీరమంతా వాపు ప్రక్రియను ప్రేరేపించటం, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవటం, కాలేయం దెబ్బతినటం వంటి తీవ్ర దుష్ప్రభావాలూ పొంచి ఉంటున్నాయి. అయితే వీటిని మెరుగుపరచి, సురక్షితంగా మార్చొచ్చని రాక్‌ఫెల్లర్ యూనివర్సిటీ ప్రయోగశాలకు చెందిన జెఫ్రీ వి.రావెచ్ 2018లో గుర్తించారు. ఈ క్రమంలోనే 2141.వీ11 మందును రూపొందించారు. దీన్ని ఇటీవలే ఇతర భాగాలకు క్యాన్సర్ విస్తరించిన 12 మందిపై పరీక్షించారు కూడా. వీరిలో ఆరుగురిలో కణితులు కుంచించుకుపోయాయి. ఇద్దరిలోనైతే రక్త, రొమ్ముక్యాన్సర్లు పూర్తిగా నయమయ్యాయి కూడా. నేరుగా మందును జొప్పించిన కణితులు మాత్రమే కాదు, ఇతర భాగాల్లోని కణితుల సైజూ తగ్గటం గమనార్హం. ఇలా శరీరమంతా ప్రభావం చూపుతున్నట్టు ఒక ప్రయోగ పరీక్షల్లో తేలటం అరుదని పరిశోధకులు చెబుతున్నారు. ఇది చాలా గొప్ప, అనూహ్య విషయమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.




















