అమరావతి: రాష్ట్రాన్ని ప్రభావితం చేసే మొంథా తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభావిత జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని, పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాల కోసం ఒక్కో కుటుంబానికి రూ.3 వేల నగదు సహాయం, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
పునరావాస కేంద్రాల నిర్వహణకు ప్రత్యేక ఇన్ఛార్జ్లను నియమించి సమగ్ర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, తుఫాన్ రక్షణ చర్యలను సమన్వయం చేసే బాధ్యత కలెక్టర్లదేనని సీఎం తెలిపారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తి నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

















