ఎన్ని సార్లు నడుం వంచాడో లెక్కే లేదు!
ఇటుక పెట్టడానికి ఒకసారి…
సిమెంట్ వేసేందుకు మరోసారి…
కొబ్బరికాయ కొట్టడానికి ఇంకోసారి…
హారతి ఇచ్చేందుకు మరోసారి…
అలా చూసుకుంటే—ఒకేరోజు ఐదు చోట్ల, ఇరవై సార్లకంటే ఎక్కువగా నడుం వంచిన రోజు అది!
విశాఖపట్నం మధురవాడ ఐటి హిల్స్‌లో గురువారం ఉదయం గంటల నుంచే వాతావరణం మారిపోయింది. ఐటి రంగం పూసగుచ్చినట్టు—ఒకేరోజు ఐదు భారీ సంస్థల శంకుస్థాపనలు. లోకేష్ చేతుల్లో విశాఖలో కొత్త ఐటి విప్లవానికి నాంది పడింది.
సీఐఐ సమ్మిట్‌కు ముందు రోజు… మంత్రి నారా లోకేష్ ఐటి రంగంలో మరో మెట్టు ఎక్కించారు. మొత్తం ₹3,800 కోట్ల పెట్టుబడులతో ఐదు పెద్ద సంస్థలు తమ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టగా—30,000 కొత్త ఉద్యోగాలకు దారి తెరిచారు. ఇటీవల గూగుల్ ఎఐ హబ్ ప్రకటన తర్వాత విశాఖపై పెట్టుబడిదారుల దృష్టి ఎలా పెరిగిందో… ఈ రోజే దానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఐదు శంకుస్థాపనల వివరాలు:
- సెయిల్స్ సాఫ్ట్‌వేర్: ₹21 కోట్లు – ఎఐ ఎక్సలెన్స్ సెంటర్, 430 ఉద్యోగాలు
- ఐస్పేస్ సాఫ్ట్‌వేర్: ₹119.18 కోట్లు – 2,000 ఉద్యోగాలు
- ఫీనోమ్ పీపుల్స్: ₹207.5 కోట్లు – గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్, 2,500 ఉద్యోగాలు
- రహేజా డెవలప్‌మెంట్ స్పేస్: ₹2,172 కోట్లు – ఐటి, రెసిడెన్షియల్ స్పేస్, 15,000 ఉద్యోగాలు
- వరల్డ్ ట్రేడ్ సెంటర్: ₹1,250 కోట్లు – 15,000 ఉద్యోగాలు
ఎఐ, క్లౌడ్, గ్లోబల్ డెలివరీ, డాటా సెంటర్లు, జిసిసి కంపెనీలు… అన్నీ ఇప్పుడు విశాఖ వైపు దూసుకొస్తున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్ ఒప్పందాల తర్వాత—మరిన్ని కంపెనీలు వరుసగా బరిలోకి.
ఉత్సాహంగా ఉన్న పారిశ్రామికవేత్తలు దగ్గరలో ఉండగానే, లోకేష్ పర్యటనకు నగరం నీరాజనాలు పట్టింది.
రోజంతా శంకుస్థాపనలు, సమావేశాలు…
రాత్రికి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరు…
అక్కడి నుండి భోగాపురం ప్రయాణం…
ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా వైజాగ్ దిగిన ఆయన, మళ్లీ రాత్రి వరకూ బ్రేక్ లేకుండా పర్యటన—
కష్టపడడంలో నాయుడికి పోటీగా నిలిచేది… నిజంగా ఆయన అబ్బాయే!


















