ఇంటర్నెట్ డెస్క్: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. చెన్నై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. రూ.40 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయమయ్యాడని సమాచారం. అన్ని ఖర్చులూ తామే భరించి బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు వెళ్లమని, భారత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని వారు ఆశ చూపినట్టు తెలిసింది.
ఈ మేరకు రెండు వారాల క్రితం విశాల్ బ్రహ్మ దిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడని, తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నై విమాన ప్రయాణం, చెన్నై నుంచి దిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.




















