అంతరిక్ష, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన డెస్టినేషన్ — మంత్రి టీజీ భరత్
అంతరిక్ష, విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్రతీరం, రాకెట్–శాటిలైట్ ప్రయోగాలకు శ్రీహరికోట వంటి వ్యూహాత్మక వేదికలు ఏపీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత భద్రమైన మరియు అనుకూలమైన ప్రాంతమని ఆయన వివరించారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ‘డిఫెన్స్, ఏరోస్పేస్, స్పేస్ ఎకోసిస్టమ్‌లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం’ పై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ఆయుధాలు, శాటిలైట్లు వంటి కీలక రంగాల్లో పరిశోధన నుంచి ఉత్పత్తి, ఎగుమతుల దాకా ప్రక్రియ అంతా రాష్ట్రం నుంచే జరిగేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని మంత్రి పేర్కొన్నారు.
ఆయుధాల ఎగుమతికి పెరుగుతున్న అవకాశాలు
డా. సతీష్ రెడ్డి (ఏరోస్పేస్ & డిఫెన్స్ సలహాదారు)
ప్రైవేట్ కంపెనీలు రక్షణ తయారీ రంగంలో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే దీర్ఘదూరంలో లక్ష్యాన్ని ఛేదించే గన్‌ను భారత్ ఫోర్జ్ ఇప్పటికే అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. అత్యాధునిక గ్రనేడ్లు, ఆయుధాల తయారీ కోసం హెచ్‌ఎఫ్‌సీఎల్ త్వరలో రాష్ట్రంలో యూనిట్ స్థాపించనున్నదని వెల్లడించారు.
ప్రపంచ ఆయుధ అవసరాల్లో కేవలం 3% మాత్రమే ఎగుమతి చేసినా, రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం పొందగలదని తెలిపారు. దొనకొండలో బెల్ సంస్థ 1,200 ఎకరాల్లో భారీ ఆయుధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నదని వివరించారు.
అంతరిక్ష రంగానికి ఏపీ—అగ్రగామి ప్రోత్సాహం
డా. సోమనాథ్ (స్పేస్ రంగ సలహాదారు)
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మరింత ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. శ్రీహరికోట రాష్ట్రానికి ఉన్న అత్యంత కీలకమైన బలం అని ఆయన చెప్పారు. తక్కువ వ్యయంతో రాకెట్లు, శాటిలైట్లు తయారు చేసి ప్రయోగించే అవకాశాలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్పేస్ కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు ఉండడంతో, వాటిని స్పేస్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
రూ. 1,400 కోట్లు పెట్టుబడితో హెచ్‌ఎఫ్‌సీఎల్ కొత్త యూనిట్
సంపత్‌కుమార్ (ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, హెచ్‌ఎఫ్‌సీఎల్)
రాష్ట్రంలో ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయాలనే తమ ప్రతిపాదనకు ప్రభుత్వం వేగంగా స్పందించి, కేవలం కొన్ని రోజుల్లోనే అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చిందని చెప్పారు. మడకశిర సమీపంలో వెయ్యి ఎకరాలను కేటాయించగా, రూ. 1,400 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ యూనిట్ ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్షంగా, మరో 2,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. సంవత్సరానికి నాలుగు మిలియన్ హ్యాండ్ గ్రనేడ్లు, అలాగే యూరోపియన్ కంపెనీతో కలిసి 1.5 ఎంఎం గన్స్ తయారుచేసి దేశీయ మరియు విదేశీ మార్కెట్లకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.



















