రూ.130 కోట్ల పన్ను విషయమై అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించండి
శక్తి ఫెర్రో సంస్థకు 3 వారాల గడువు మంజూరు
ఈనాడు, అమరావతి: శక్తి ఫెర్రో ఎల్లాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఏఐపీఎల్) సంస్థకు రూ.130.61 కోట్ల పన్నును విధిస్తూ జీఎస్టీ రాష్ట్ర అధికారులు జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని జీఎస్టీ ‘అప్పిలేట్ అథారిటీ’ విచారించడం ఉత్తమం అని అభిప్రాయపడింది. ఆ పన్నులో సంస్థ ఇప్పటికే 10 శాతం చెల్లించిందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అప్పిలేట్ అథారిటీలో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు సంస్థకు 3 వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబరు 26న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
- చిత్తూరు జిల్లా వసనాడుగొల్లపల్లి గ్రామ పరిధిలోని ఎస్‌ఎఫ్‌ఏఐపీఎల్ సంస్థ.. ఉక్కు తుక్కు వర్తకంతో పాటు లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, టీఎంటీ బార్ల తయారీ, ఇతర ఉత్పత్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. శక్తి ఫెర్రో సంస్థ 2017-18 నుంచి 2020-21 వరకు రాష్ట్ర జీఎస్టీతోపాటు వడ్డీ, జరిమానా కింద మొత్తం రూ.130.61 కోట్ల చెల్లింపునకు తిరుపతిలోని జీఎస్టీ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ (రాష్ట్ర పన్నులు) 2024 సెప్టెంబరు 5న ‘పన్ను మదింపు ఉత్తర్వులు’ జారీచేశారు.
- ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శక్తి ఫెర్రో సంస్థ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది. తాజాగా జరిగిన విచారణలో సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వస్తువుల కొనుగోలు దస్త్రాలను పరిశీలిస్తే జీఎస్టీ అధికారులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదనేది స్పష్టమవుతోందన్నారు. మదింపు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.
- రాష్ట్ర జీఎస్టీ అధికారుల తరఫున వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) మన్నం కృష్ణారావు వాదనలు వినిపించారు. ‘పలు కంపెనీల నుంచి తమకు వస్తువులు సరఫరా అయ్యాయని శక్తి ఫెర్రో సంస్థ చేస్తున్న వాదనకు ఆధారాలు లేవు. ఉనికిలో లేని సంస్థలు, వ్యక్తుల నుంచి శక్తి సంస్థ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందింది. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ఉనికిలో లేని సంస్థలను ఏర్పాటు చేశారు. వస్తువుల రవాణాకు సంబంధించిన వివరాలు లేవు’ అని అన్నారు.
- ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు లోతైన విచారణ (ఎంక్వైరీ) అవసరమని అభిప్రాయపడింది. లోతుల్లోకి వెళ్లి విచారించేందుకు జీఎస్టీ అప్పిలేట్ అథారిటీ సరైనదని పేర్కొంది. అప్పీల్ వేసుకునేందుకు శక్తి ఫెర్రో సంస్థకు సమయం ఇచ్చింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది.


















