ఫిట్‌నెస్ సాధించాలంటే జిమ్ తప్పనిసరిగా వెళ్లాల్సిన అవసరం ఉందా? నిపుణులు చెబుతున్నారంటే.. ఆ అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే ఇంట్లో ఓ మినీ జిమ్‌ను ఏర్పాటు చేసి, జిమ్ అనుభూతి పొందవచ్చని సూచిస్తున్నారు. ఎలా చేయాలో చూద్దాం:
⚛ స్థలం నిర్ణయించండి: ఇంట్లో జిమ్ కోసం ముందుగా ఎంత ఖాళీ ప్రదేశం ఉందో, ప్రత్యేక గదిని కేటాయించగలరా లేదా బాల్కనీని ఉపయోగిస్తారా అని నిర్ణయించాలి. స్థలాన్ని బట్టి జిమ్ ఏర్పాటును సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
⚛ అన్ని రకమైన మెషినరీ అవసరం లేదు: ఇంట్లో జిమ్ సెంటర్‌లా ప్రతి యంత్రం అవసరం లేదు. ఫిట్‌నెస్ లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించి, అందుకు సరిపడే వ్యాయామాల కోసం మాత్రమే మెషినరీ ఎంపిక చేయాలి. ఒక యోగా మ్యాట్ ఉంటే నేలపై చేసే పులప్స్, పుషప్స్ వంటి వ్యాయామాలకు సరిపోతుంది.
⚛ ఇంట్లోని వస్తువులను ఉపయోగించండి: వెయిట్ లిఫ్టింగ్ కోసం బరువైన వస్తువులు, పుషప్స్‌కు బాస్కెట్ బాల్, జంపింగ్ కోసం స్కిప్పింగ్ రోప్, కార్డియో కోసం మెట్లు వాడవచ్చు. ఒకే మెషీన్‌తో విభిన్న వ్యాయామాలు చేయగల మల్టీపర్పస్ మెషీన్స్ ఎంచుకుంటే డబ్బు, స్థలం రెండూ ఆదా అవుతుంది. ఉదాహరణకు స్టెబిలిటీ బాల్‌తో కోర్ వ్యాయామాలు, యోగా చేయవచ్చు.
⚛ గాలి, వెలుతురు: జిమ్ ప్రదేశంలో గాలి, ప్రకృతి వెలుతురు అందుబాటులో ఉండాలి. వ్యాయామ సమయంలో శరీరం చెమట పడుతుంది, ఆ సమయంలో సరైన గాలి లేకపోతే అసౌకర్యంగా ఉంటుంది. సహజ వెలుతురు మనసును ఉత్తేజితం చేస్తుంది.
⚛ పచ్చదనం: ఇంట్లో గార్డెన్ ఉంటే, జిమ్ మెషినరీని చెట్ల మధ్య ఏర్పాటు చేయవచ్చు. లేని వారు ఇండోర్ ప్లాంట్స్‌తో ప్రదేశాన్ని అలంకరించవచ్చు. మానసికోల్లాసం పెరుగుతూ, స్థలాన్ని కూడా సమర్థంగా వాడవచ్చు.
ఇలా ఇంట్లోనే సులభంగా, తక్కువ ఖర్చుతో ఫిట్‌నెస్ సాధించవచ్చు.




















