మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్), బీఈడీ చేసి ఏడేళ్లుగా టెక్సాస్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాను. వీసా పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేద్దామనుకుంటున్నా. 40 ఏళ్ల వయసులో ఉద్యోగావకాశాలుంటాయా? నైపుణ్యాలు పెంచుకుని రెండేళ్లలో ఉద్యోగం సంపాదించగలనా?
ఎడ్యుటెక్ కంపెనీల్లో కంటెంట్ డెవలపర్, ఆన్‌లైన్ టీచర్ లాంటి ఉద్యోగాలూ పొందవచ్చు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్/ కార్పొరేట్ స్కూల్స్, ఎడ్యుటెక్ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ.
- యూఎస్‌ఏలో ఏడు సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లలో అవకాశం పొందడం పెద్ద కష్టం కాదు. కానీ మొదట్లో ఆశించినంత వేతనం పొందే అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం వేగంగా మార్పులు చెందుతోంది. ఏపీలో జాతీయ విద్యావిధానం 2020 అమల్లోకి రావడంతో పాఠ్యాంశాల్లో గణితం, కంప్యుటేషనల్ థింకింగ్, టెక్నాలజీ ఆధారిత బోధనకు విస్తృత ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేథమెటిక్స్‌లో మాస్టర్స్‌తో పాటు, బీఈడీ చేసిన మీకు అంతర్జాతీయ బోధనానుభవం అదనపు అర్హత.
- ప్రభుత్వ ఉద్యోగంపై మీకు ఆసక్తి ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ రాయడానికి గరిష్ట వయసు 44 ఏళ్లు. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే ముందుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత డీఎస్సీలో మెరుగైన ప్రతిభ కనపరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందొచ్చు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షల ద్వారా మేథమెటిక్స్‌లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపక పోస్టులకూ పోటీ పడవచ్చు.
- వీటితో పాటు ప్రైవేటు రంగంలో వివిధ రకాల అవకాశాలున్నాయి. కార్పొరేట్, ఐఐటీ ఫౌండేషన్, టెక్నో, ఒలిËంపియాడ్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఉపాధ్యాయ కొలువులకు విస్తృత అవకాశాలుంటాయి. ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో మ్యాథ్స్ బోధించే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ స్కూళ్లలో బోధనానుభవం ఉన్న కారణంగా ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ సిలబస్‌ను అనసరిస్తున్న పాఠశాలలు మీకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తాయి.
- నూతన జాతీయ విద్యా విధానం 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే పాఠశాలల్లో నైపుణ్యాలున్న ఉపాధ్యాయుల అవసరాలు మరింతగా పెరుగుతాయి. ఈ క్రమంలో మీకున్న అనుభవం, అర్హతలతో మెరుగైన ఉద్యోగం పొందొచ్చు.
- మీకు ఉన్నతవిద్యపై ఆసక్తి ఉంటే ఎంఈడీ చేసి ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. మ్యాథ్స్‌లో కూడా పరిశోధన చేసే వీలుంటుంది. పీహెచ్‌డీలో ప్రవేశం కోసం యూజీసీ నెట్ పరీక్ష రాయాలి. నలభై ఏళ్ల వయసులో వేరే రంగంలో ప్రవేశించే బదులు, మీకు అనుభవమున్న బోధన రంగంలోనే స్థిరపడే ప్రయత్నం చేయండి. ఆర్థిక వనరులు సమకూర్చుకొని మీరే ఒక ప్రైవేటు పాఠశాలను ప్రారంభించే ప్రయత్నమూ చేయవచ్చు.




















