కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అమరావతి రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణం సాధారణం కాదని, ఒక సుదీర్ఘ ప్రణాళిక మేరకే ఇది సాధ్యమని సూచించారు. శుక్రవారం అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపనలు చేసి, తర్వాత సమావేశంలో మాట్లాడుతూ.. ఒకే ప్రదేశంలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదని, భవిష్యత్‌లో రాజధాని నిర్మాణంలో అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని పేర్కొన్నారు.
నిర్మలాసీతారామన్ చెప్పిన ప్రకారం, ‘‘అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములు సమర్పించిన రైతులు గొప్ప త్యాగం చేశారు. అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలు అందించడం బ్యాంకుల ప్రధాన బాధ్యత. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు సదుపాయం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా జరుగుతోంది. కూరగాయలు, పండ్లను ఏపీని హబ్‌గా చేసి, ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు సహకారం అందించాలి. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అందరూ గర్వపడాలి. ఇదే విధంగా అమరావతి అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షిస్తున్నా’’ అని తెలిపారు.



















