మీరు బీటెక్, ఎంబీఏ (మార్కెటింగ్) పూర్తిచేసి పాఠశాల ప్రారంభించాలని అనుకోవడం నిజంగా మంచి ఆలోచన. బీటెక్ ద్వారా మీరు తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పొందుతారు. ఎంబీఏతో బిజినెస్, మార్కెటింగ్, నాయకత్వం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మోటివేషన్ వంటి నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి. ఈ రెండు కోర్సులు కలగలిపి ఉండడం వల్ల స్కూల్ నిర్వహణలో మీకు మంచి సహకారం అందుతుంది.
అయితే, బోధన వృత్తికి సంబంధించిన సబ్జెక్టులపై మీ అవగాహన పెంచుకోవాలంటే బీఈడీ చేయడం చాలా ఉపయోగకరం. గతంలో బీటెక్ విద్యార్థులకు బీఈడీ చేసే అవకాశం లేకపోయినా, ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఆ అవకాశం కల్పించింది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామకాలలో కూడా బీటెక్–బీఈడీ చేసిన పలువురు ఉద్యోగాలు సాధించారు.
కాబట్టి, మీరు ముందుగా బీఈడీ పూర్తిచేసి, కార్పొరేట్ లేదా ప్రైవేట్ స్కూల్లో కొంతకాలం పని చేస్తే, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవచ్చు. బీఈడీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి, రెగ్యులర్‌గా కళాశాలకు హాజరవ్వాలి. అలా చదివితేనే ఉపాధ్యాయ వృత్తిలో మీరు మెరుగైన స్థాయికి చేరగలుగుతారు.
తర్వాత, స్కూల్ నడిపే అనుభవం వచ్చిన తర్వాత, ఆసక్తి ఉంటే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, స్కూల్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజ్డ్ కోర్సులు కూడా చేయవచ్చు.




















