తాడేపల్లి:
తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి రైతులు పెద్దఎత్తున నష్టపోయారని తెలిపారు. పంటలు పొట్టదశలో ఉన్న సమయంలో తుఫాను తాకడంతో దిగుబడులు తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.
జగన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ తుఫాను దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. మొత్తం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో వరి పంట 11 లక్షల ఎకరాల్లో, పత్తి 1.14 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 1.15 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 2 లక్షల ఎకరాల్లో, అలాగే హార్టికల్చర్ పంటలు 1.9 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని తెలిపారు.
జగన్ ఈ సందర్భంలో గత ప్రభుత్వ కాలంలో రైతులకు అందించిన రక్షణ వ్యవస్థలను ప్రస్తావించారు. “మా పాలనలో ఆర్బీకేలు అప్రమత్తంగా ఉండేవి. ప్రతి పంటకూ ఇ-క్రాప్ చేసేవాళ్లం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో పనిచేసేవి. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కలిగించేవాళ్లం. 80 లక్షల మంది రైతులు బీమా కవర్‌లో ఉండేవారు, 70 లక్షల ఎకరాలు ఆ పరిధిలో ఉండేవి,” అని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇప్పుడేమో 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతులు ఎవరిని ఆశ్రయించాలి? నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. ఇ-క్రాప్ సర్వే సక్రమంగా జరగడం లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారం 5.5 లక్షల మంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు,” అని విమర్శించారు.
జగన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉదాహరణలతో తప్పుబట్టారు. “మిర్చి క్వింటాల్‌కు రూ.11,781కి కొనుగోలు చేస్తామని చెప్పారు, కానీ ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. మామిడిని కిలో రూ.12కి కొనుగోలు చేస్తామన్నారు, కానీ హామీ నెరవేర్చలేదు. పొగాకు రైతులను ఆదుకుంటామని చెప్పి కూడా చర్యలు తీసుకోలేదు,” అని మండిపడ్డారు.
అంతిమంగా, వైఎస్ జగన్ పార్టీ నేతలకు రైతులకు అండగా నిలవాలని సూచించారు. “ఇలాంటి పరిస్థితుల్లో మనం రైతుల పక్షాన నిలబడాలి. వారిని ప్రోత్సహించాలి, వారి నష్టాన్ని ప్రభుత్వం గుర్తించేలాగ చూడాలి,” అని దిశానిర్దేశం చేశారు.




















