ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు, లాభాల స్వీకరణ వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపించాయి. ప్రారంభంలో బలంగా కనిపించిన మార్కెట్ చివరకు ఫ్లాట్‌గా ముగిసింది.
మునుపటి సెషన్‌లో భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ (82,225) నేడు కోలుకునే ప్రయత్నం చేసింది. ఉదయం 82,530 వద్ద ప్రారంభమైన సూచీ, ఒక దశలో 800 పాయింట్ల వరకు ఊగిసలాటకు లోనైంది. ఇంట్రాడేలో 82,957 గరిష్ఠానికి చేరగా.. 82,132 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 50 పాయింట్ల లాభంతో 82,276 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 25,482 వద్ద స్థిరపడింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.95 వద్ద నిలిచింది. ఐటీ, ఆటో, లోహ రంగాల షేర్లు కొంత మద్దతు అందించాయి.నిఫ్టీ సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు రిలయన్స్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి.
మొత్తంగా చూస్తే, గ్లోబల్ సంకేతాలు, విదేశీ నిధుల ప్రవాహం, రూపాయి మారకపు విలువ తదితర అంశాలపై ఆధారపడి రాబోయే సెషన్లలో మార్కెట్ దిశ నిర్ణయమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



















