అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, హెచ్చరికలు ప్రపంచ దేశాలపై గతంలో మాదిరిగా ప్రభావం చూపడం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు తమ నిర్ణయాలను ఇప్పటికే స్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఇతర దేశాలను తన ఆదేశాల మేరకు నడిపించే స్థితిలో లేదని గాలిబఫ్ అన్నారు. తమపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తరచూ కఠిన హెచ్చరికలు చేస్తోందని, అయితే వాటిని చాలా దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇరాన్‌తో ఆర్థిక లావాదేవీలు కొనసాగించే దేశాలు, సంస్థలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇటీవల హెచ్చరించారు. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచే చర్యల్లో భాగంగా ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ను అమెరికా చేపట్టింది.
అయితే అమెరికా ఆంక్షలు, ఒత్తిళ్లకు ఇరాన్ వెనక్కి తగ్గబోదని గాలిబఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు కూడా అమెరికా హెచ్చరికల నేపథ్యంలో తమ వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఆర్థిక, దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.



















