అమరావతి: రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఐ అండ్ ఐ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు మరియు దక్షిణ కోస్తా రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా నడికుడి–శ్రీకాళహస్తి, గుంటూరు–గుంతకల్, గుణదల–ముస్తాబాద్ బైపాస్, రాయదుర్గ్–తుముకూరు రైల్వే లైన్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు వివరాలు అందించారు.
రైల్వే ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని, ఆలస్యానికి కారణాలు గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నదే సీఎం ఆదేశం. రైల్వేశాఖ దృష్టికి తక్షణం తీసుకెళ్లాల్సిన అంశాలపై కూడా చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే శాఖకు కొత్త రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ మరియు అండర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి పలు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తవడంతో రాష్ట్రంలో రవాణా మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని, పరిశ్రమల అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.



















