గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లూ ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో మాత్రం కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాల భూమి ఉందని చెప్పారని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ కుటుంబ ఆస్తులపై కేసీఆర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. అదే విధంగా రేవంత్‌రెడ్డి పుట్టినప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తులపై కూడా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు.
కేసీఆర్‌కు వ్యవసాయంపై ఆసక్తి ఉందని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యవసాయం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తమ కుటుంబానికి గతంలోనూ వ్యవసాయ భూములు ఉన్నాయని, చింతమడకలోని కుటుంబ ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉండగా, కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూములపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. సుమారు 700 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను పరిశీలించాలని, అందులో ప్రభుత్వ భూమి ఉందా లేదా అన్నది తేల్చాలని అధికారులను ఆదేశించారు. విచారణను 30 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు.
22-ఏ భూముల అంశంలోనూ తమ వైఖరిని కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజాక్షేత్రంలో ప్రశ్నలు లేవనెత్తుతామని తెలిపారు. అసెంబ్లీలో తమపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన పేర్కొన్నారు.



















