కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేరుతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు రూపొందించి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని ఏపీ సీఐడీ సైబర్ నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలానికి చెందిన సలాది రామ్‌గోపాల్‌ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 60 మంది నిరుద్యోగుల నుంచి రూ.93 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. మోసం ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో రామ్‌గోపాల్‌పై ఇప్పటికే 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పేరుతో నకిలీ ఉద్యోగ ప్రకటనలను పత్రికల్లో ప్రచురించేవాడు. ఇందుకోసం నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను కూడా సృష్టించాడు. ప్రకటనలను చూసి అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఆధారంగా వారిని సంప్రదించి, తాను కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారినంటూ పరిచయం చేసుకునేవాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. నమ్మకం కలిగించేందుకు నకిలీ ధ్రువపత్రాల పరిశీలన లేఖలు, ఇంటర్వ్యూ లేఖలు, నియామక ఉత్తర్వులు, శిక్షణ ఉత్తర్వులు తయారు చేసి అభ్యర్థులకు పంపించేవాడు.
నకిలీ పత్రాలను నమ్మిన కొందరు అభ్యర్థులు ఉద్యోగంలో చేరేందుకు ఇటీవల మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ అసలు విషయం వెలుగులోకి రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు సీఐడీ సైబర్ నేరాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా రామ్‌గోపాల్‌ను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్, కీప్యాడ్ ఫోన్, ల్యాప్‌టాప్, నకిలీ ఉద్యోగ నోటిఫికేషన్లు, కాల్ లెటర్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకునేందుకు నిందితుడు మ్యూల్ బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఓఎల్‌ఎక్స్ ద్వారా పలువురిని సంప్రదించి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకునేవాడు. ఇందుకు ప్రతిఫలంగా 30 శాతం కమీషన్ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు.
అలాగే ‘ఆయుష్మాన్ భారత్ ఫౌండేషన్’ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి అందులోనూ డబ్బులు జమ చేయించేవాడు. తన ఆనవాళ్లు దొరకకుండా నకిలీ కేవైసీ పత్రాలతో సుమారు 15 సిమ్ కార్డులను తీసుకున్నాడు. తరచూ ఫోన్లు మార్చేవాడని, ఒకే సిమ్ కార్డును ఏకంగా 278 మొబైళ్లలో వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి విజయవాడలో సంచరిస్తున్న సమయంలో సీఐడీ అధికారులు అతడిని పట్టుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















