తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక చర్యలు చేపట్టింది. జలాల వినియోగం, సాగునీటి అవసరాలు, సాంకేతిక అంశాలు, పరిపాలనా సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు 9 మంది సభ్యులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ సంజయ్‌కుమార్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో తుంగభద్ర జలాల సమర్థ వినియోగం, నదీ పరీవాహక ప్రాంతంలోని సమస్యలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్రం అందించాల్సిన సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.
కేంద్రం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి కేంద్ర జలసంఘం సభ్యుడిని ఛైర్మన్‌గా నియమించారు. కమిటీలో తుంగభద్ర బోర్డు సభ్యులైన కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, కేంద్ర జలసంఘానికి చెందిన వివిధ విభాగాల చీఫ్ ఇంజినీర్లు, తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా నియమించారు.
తుంగభద్ర బేసిన్‌లోని సమస్యలపై న్యాయపరమైన, సాంకేతిక, నిర్వహణ, సంస్థాగత అంశాలను కమిటీ పరిశీలించనుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరిపి సమగ్ర నివేదికను రూపొందించనుంది.
ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని కేంద్రం కమిటీకి గడువు విధించింది. ముఖ్యంగా తుంగభద్ర జలాల పంపిణీ, రిజర్వాయర్ నిర్వహణ, నీటి లభ్యత, భవిష్యత్ అవసరాలు, సాగునీటి ప్రాజెక్టులపై కమిటీ దృష్టి సారించనుంది.
అలాగే రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) కింద ఉన్న సాగునీటి అవసరాలను కూడా కమిటీ ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రాంతాల అవసరాలు, నీటి లభ్యత, ప్రస్తుత సమస్యలను పరిశీలించి తగిన సూచనలు చేయనుంది.
తుంగభద్ర నది నీటి వినియోగానికి సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచి, జల వనరుల సమర్థ వినియోగానికి మార్గం సుగమం చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















