రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లకు హైకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. ఒప్పంద, పొరుగుసేవల కార్మికులకు ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కారణంతో కార్పొరేషన్లపై ఈఎస్‌ఐ అధికారులు విధించిన డ్యామేజెస్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈఎస్‌ఐ చట్టంలోని సెక్షన్ 1(15) ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆ చట్టాన్ని వర్తింపజేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 19న మున్సిపల్ కార్పొరేషన్లను ఈఎస్‌ఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. అందువల్ల ఆ తేదీ నుంచి మాత్రమే ఈఎస్‌ఐ నిబంధనలు కార్పొరేషన్లకు వర్తిస్తాయని పేర్కొంది. అంతకుముందు కార్మికుల సంక్షేమం కోసం కార్పొరేషన్లు స్వచ్ఛందంగా ఈఎస్‌ఐకి చందాలు చెల్లించిన నేపథ్యంలో.. వాటిలో జాప్యం జరిగిందని డ్యామేజెస్ విధించడం సమర్థనీయం కాదని తేల్చింది.
2010 అక్టోబర్ నుంచి 2014 డిసెంబర్ మధ్య ఈఎస్‌ఐ చందా చెల్లింపులో జాప్యం జరిగిందంటూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై రూ.31.52 లక్షల డ్యామేజెస్ విధించారు. 2016 మే 20న ఈఎస్‌ఐ అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే తరహాలో మరికొన్ని కార్పొరేషన్లపైనా జరిమానాలు విధించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ కార్పొరేషన్లు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గమైన ఈఎస్‌ఐ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ సింగిల్ జడ్జి వ్యాజ్యాలను కొట్టేశారు. దీంతో కార్పొరేషన్లు 2024లో ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి.
విచారణ సందర్భంగా కార్పొరేషన్ల తరఫు న్యాయవాది కోకా సత్యనారాయణరావు వాదనలు వినిపించారు. వాదనలు, రికార్డులను పరిశీలించిన ధర్మాసనం.. 2023 ఏప్రిల్ 19కు ముందు కాలానికి ఈఎస్‌ఐ చట్ట నిబంధనలను వర్తింపజేసి డ్యామేజెస్ వసూలు చేసే అధికారం అధికారులకు లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలు కూడా సరైనవి కావని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులతోపాటు ఈఎస్‌ఐ కార్పొరేషన్ జారీ చేసిన డ్యామేజెస్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇప్పటికే నష్టపరిహారం పేరుతో ఏదైనా మొత్తం వసూలు చేసి ఉంటే.. దాన్ని ఎనిమిది వారాల్లో సంబంధిత కార్పొరేషన్లకు తిరిగి చెల్లించాలని ఈఎస్‌ఐ అధికారులను ఆదేశించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















