భారత రక్షణ సామర్థ్యంలో మరో అధునాతన అస్త్రం చేరనుంది. అమెరికా నుంచి జావెలిన్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
యూఎస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ విధానంలో భాగంగా జావెలిన్ క్షిపణుల కొనుగోలుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్పై భారత సైన్యం సంతకం చేసింది. అయితే భారత్ ఎన్ని క్షిపణులను కొనుగోలు చేస్తోంది, ఈ ఒప్పందం విలువ ఎంత అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.
జావెలిన్ అనేది శత్రు ట్యాంకులను ధ్వంసం చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఏటీజీఎం). దీనిని సైనికులు భుజంపై నుంచి సులభంగా ప్రయోగించవచ్చు. క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఇందులో ప్రధాన భాగాలు.
జావెలిన్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ప్రయోగించిన ప్రాంతాన్ని శత్రువు వెంటనే గుర్తించడం కష్టం. సాధారణంగా క్షిపణులు ప్రయోగించినప్పుడు పొగ, వేడి కారణంగా శత్రు దళాలు వాటిని గుర్తిస్తాయి. అయితే జావెలిన్‌లో మొదట చిన్న మోటార్ ద్వారా క్షిపణిని ట్యూబ్ నుంచి బయటకు పంపి, అనంతరం ప్రధాన మోటార్ పనిచేస్తుంది. దీంతో ప్రయోగించిన సైనికులు వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఈ క్షిపణిలో రెండు దశల్లో పనిచేసే పేలుడు వ్యవస్థ ఉంటుంది. మొదటి దశలో ట్యాంక్ రక్షణ కవచాన్ని ఛేదించి.. రెండో దశలో వార్‌హెడ్ ద్వారా ట్యాంకును ధ్వంసం చేస్తుంది. రీయాక్టివ్ ఆర్మర్ వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలను కూడా ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉంది.
జావెలిన్ క్షిపణులను అమెరికాకు చెందిన రక్షణ సంస్థలు Lockheed Martin, RTX Corporation అభివృద్ధి చేశాయి. వీటి తయారీ క్లిష్టమైనదిగా, ఖరీదైనదిగా పరిగణిస్తారు.
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణులను విస్తృతంగా వినియోగించింది. రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. వీటి ప్రభావాన్ని తగ్గించేందుకు రష్యా ట్యాంకులపై అదనపు రక్షణ కవచాలు, లోహపు బోన్లు ఏర్పాటు చేసిందంటే వీటి సామర్థ్యం ఎంతటిదో అర్థమవుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















