ర్యాంప్‌పై మెరిసిన ఈ గౌను తొలిచూపులో ఓ ఫ్యాషన్ డ్రెస్‌లానే కనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఓ తల్లి గర్భధారణ నుంచి ప్రసవం వరకు అనుభవించే భావోద్వేగాలు, శారీరక మార్పులు, ముఖ్యంగా సీజేరియన్ ప్రసవంలోని వివిధ దశలను ప్రతిబింబించేలా ఈ గౌనును రూపొందించారు.
వియత్నాంలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఉగాండా ట్రివియా ఎల్లీ ముహోజా ఈ ప్రత్యేకమైన గౌనును ధరించి ర్యాంప్‌పై నడిచారు. దీంతో ఆమె ధరించిన డ్రెస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఉగాండాకు చెందిన డిజైనర్ కీషా అబ్దల్లా ఈ గౌనును ‘లేయర్స్ ఆఫ్ లైఫ్’ పేరుతో రూపొందించారు. మాతృత్వం, ప్రసవం, జీవం ఆవిర్భవించే అద్భుత ఘట్టాలను ఫ్యాషన్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతో దీనిని తీర్చిదిద్దారు.
మహిళ గర్భంలోని వివిధ పొరలకు ప్రతీకగా పీచ్, గోల్డ్, కోరల్, రెడ్, మెరూన్, బర్గండీ వంటి రంగులను గౌనులో ఉపయోగించారు. ప్రతి పొర ప్రసవ ప్రక్రియలోని ఓ దశను సూచించేలా డిజైన్ చేశారు. వస్త్రాల కదలిక మాతృత్వంతో వచ్చే భావోద్వేగాలు, అంతర్గత పరివర్తనకు ప్రతీకగా నిలిచేలా తీర్చిదిద్దారు.
సీజేరియన్ ప్రసవంలో మహిళ ఎదుర్కొనే శారీరక, భావోద్వేగ అనుభవాలను కూడా ఈ డిజైన్ ప్రతిబింబిస్తుంది. శరీరాన్ని ఓ కళారూపంగా తీసుకుని, ఫ్యాషన్‌ను సందేశాన్ని వ్యక్తపరిచే భాషగా మార్చితే ఎలాంటి అద్భుతాన్ని సృష్టించవచ్చో ఈ గౌను చాటిచెబుతోందని డిజైనర్ వివరించారు.
ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా, చర్మం రంగు ఎలా ఉన్నా ప్రతి మనిషి తల్లి గర్భంలోని ఈ పొరలను దాటి ఈ భూమ్మీదకు వస్తాడనే సార్వత్రిక సందేశాన్ని ఈ డిజైన్ అందిస్తుంది. అందాల పోటీ వేదికపై కేవలం అందాన్ని ప్రదర్శించకుండా మాతృత్వపు గొప్పతనాన్ని, తల్లి అనుభవించే ప్రసవ ప్రయాణాన్ని కళారూపంలో చూపించడం విశేషంగా నిలిచింది.
వినూత్న ఆలోచనతో అంతర్జాతీయ వేదికపై మాతృత్వానికి గౌరవం తీసుకొచ్చిన డిజైనర్ కీషా అబ్దల్లాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















