22ఏ నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు న్యాయబద్ధమైన ప్రైవేటు భూముల హక్కులను కాపాడటమే 22ఏ నిబంధనల ఉద్దేశమన్నారు. నిషేధిత జాబితాలో లక్షల ఎకరాలను కొత్తగా చేర్చారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.
ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా మార్చిన ఘటనలను గుర్తించి వాటిని 22ఏ పరిధిలోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలతో పాటు మరో ప్రాంతంలో 400కుపైగా ఎకరాలు కలిపి 522 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు తెలిపారు.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. గతంలో నకిలీ జీవోలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యవహారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మూడేళ్లలో 23,136 ఎకరాలు 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు రెవెన్యూ శాఖ నివేదికలో పేర్కొంది. భూ యజమానులు, రైతులు తమ యాజమాన్య హక్కులకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో వాటిని పరిశీలించి తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం యాజమాన్య హక్కులపై స్పష్టత లేని 3.73 లక్షల ఎకరాలు 22ఏ పరిధిలో ఉన్నట్లు వెల్లడించింది.
భూభారతి పోర్టల్‌లో 22ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కులను నిర్ధారించే ఆధారాలు సమర్పిస్తే వాటిని పరిశీలిస్తామని రెవెన్యూ శాఖ తెలిపింది. అర్హత, ఆధారాల ఆధారంగా భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలా.. తొలగించాలా అనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
22ఏ టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన 980 ఫిర్యాదుల్లో 98 శాతం పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తికాని వారికి ఈ వారాంతంలోపు నగదు తిరిగి చెల్లించే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రైవేటు భూముల హక్కుల నిర్ధారణకు రెవెన్యూ శాఖ చర్యలు చేపడుతోంది. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములపై యాజమాన్య హక్కులు స్పష్టంగా నిర్ధారణ కాకపోతే బదిలీలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం కొనసాగుతుంది. అయితే సరైన ఆధారాలు సమర్పించి హక్కులను నిరూపించుకున్న భూములను పరిశీలన అనంతరం నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 2.49 కోట్ల ఎకరాల భూములు భూభారతి పోర్టల్‌లో నమోదై ఉండగా.. అటవీ భూములతో కలిపి 98.02 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ శాఖ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడం, భూములపై హక్కుల విషయంలో స్పష్టత తీసుకురావడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















